వివేకా కేసులో కీలక పరిణామం.. వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వైసీపీ అధికారంలోకి రాకముందు 2019లో వైఎస్ వివేకా దారుణ రీతిలో హత్యకు గురయ్యారు. అప్పట్లో ఇది టిడిపి పనే అంటూ వైసీపీ, వైసీపీ పనే అంటూ టిడిపి పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయగా తర్వాత వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి కీలక వివరాలు రాబట్టలేక పోయారు. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఇక అవినాష్ రెడ్డి రేపు విచారణకు రావాలని సిబిఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో సీబీఐ ఆఫీసుకు విచారణ నిమిత్తం రావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కడపలో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను పరిశీలించిన తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది.

అయితే ఈ కేసులో వైఎస్ కుటుంబమే నిందితులంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక వైయస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ హైలెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రేపు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రేపు విచారణకు హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Previous articleకియా క్రెడిట్ కొట్టేయాలని విజయ సాయి రెడ్డి చేసిన ప్రయత్నానికి ఎదురుదెబ్బ!
Next articleఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతీకారం మొదలైందా?