విశాఖపట్నం (ఉత్తర) మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఫిరాయింపులకు సంబంధించి విశాఖపట్నం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఇది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా ఫిరాయింపునకు సంబంధించి కొన్ని రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో కథనాలు వచ్చాయి.
విశాఖపట్నం ఇన్చార్జి వైఎస్ఆర్సీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఉత్తర కోస్తా ఆంధ్రాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ లాబీయింగ్ చేయడంతో గంటా వైఎస్ఆర్సీలో చేరేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే గంటా నుంచి కానీ, వైఎస్సార్సీపీ నుంచి కానీ ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఈ విషయంలో టీడీపీ నాయకత్వం కూడా మౌనం దాల్చింది.అకస్మాత్తుగా, గంటా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పోరాటాన్ని ప్రారంభించారు. డిసెంబరు 26న కాపు నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులకు రాబోయే సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కాంక్షిoచారు.
దీంతో గంటా వైఎస్సార్సీపీలో చేరే యోచనను విరమించుకున్నారని, ఆయన ఇంకా టీడీపీలోనే కొనసాగాలని అనుకుంటున్నారని, ఆయన భీమిలి లేదా చోడవరం లేదా అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం, గంటా పార్టీని వీడేది లేదని ఒక సమావేశంలో క్లారిటీ ఇస్తూ మాట్లాడిన వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాను రాజకీయంగా ఉన్నంత కాలం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుతో కలసి ఉంటానని చెప్పినట్లు తెలిసింది.
నేను టీడీపీలోనే ఉంటాను, టీడీపీ గెలుపు కోసం పాటుపడతాను సోషల్ మీడియా వారు ఏది కావాలంటే అది రాయనివ్వండి కానీ నేను టీడీపీలోనే కొనసాగుతాను అని మాజీ మంత్రి వీడియోలో చెబుతున్నారు. ఇది పాత వీడియో అని వైఎస్సార్సీ వర్గాలు అంటుండగా గంటా పార్టీని వీడేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పుడు తన న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్‌తో కాస్త క్లారిటీ ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు!