వచ్చేనెల నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌ నుండి బయటకు వచ్చి, రాబోయే నెలల్లో ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు పెండింగ్‌లో ఉన్న హామీలను నెరవేర్చడంతోపాటు ఎన్నికలకు ముందు మరిన్ని వాగ్దానాలు చేయడంపై దృష్టి సారించిన కేసీఆర్ వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనలను పునఃప్రారంభించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబరు 4న ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లో పర్యటించి,అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు పాత కలెక్టరేట్‌ ఆవరణలో నూతన ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇంకా, ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల కోసం అనేక చర్యలను ప్రకటించే అవకాశం ఉంది.
అనంతరం షెడ్యూల్ ఖరారైన మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలన్నారు.
అందుకనుగుణంగా పార్టీ నేతలకు చేరువయ్యే కార్యక్రమాలను ప్లాన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు కూడా వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితమైన తేదీలు ఖరారు చేసిన తర్వాత ఆయన ఈ జిల్లాల పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Previous articleకాంగ్రెస్ పార్టీ సీనియర్లను రేవంత్ రెడ్డి దూరం చేస్తున్నారా?
Next articleశ్రీలక్ష్మికి నో ఛాన్స్.. తదుపరి సీఎస్ జవహర్ రెడ్డి