మునుగోడులో టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్న బీసీలు?

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌… బీసీ సంఘాలు మెల్లగా ఆ పార్టీకి దూరమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో బీసీ సంఘాల నేతల హాజరు అంతంతమాత్రంగా మారింది. తమ ఆవేదనను టీఆర్‌ఎస్‌ అర్థం చేసుకోవడం లేదని బీసీ నేతలు భావించడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ టికెట్‌ ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించగా, టీఆర్‌ఎస్‌ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. కోమటిరెడ్డి, స్రవంతి ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో ఆ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెడుతుందని పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు.
మునుగోడులో బీసీల జనాభా గణనీయంగా ఉంది.72 శాతం మంది బీసీ వర్గాల ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్ తదితర బీసీ నేతలు పలువురు పోటీ పడుతున్నారు.
అయితే నియోజకవర్గ ఇంచార్జి మంత్రి జగదీష్‌రెడ్డి మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెడ్డి తన వ్యవహారశైలితో ఇప్పటికే పలువురు బీసీ నేతలకు దూరమయ్యారు. దీంతో బీసీ నేతలు టీఆర్‌ఎస్ సభలకు, ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి, బూర నర్సయ్య గౌడ్ పార్టీ సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదని, బీసీ నాయకుడు అయినందునే తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో 35000 గౌడ్‌లు, 21000 యాదవులు, 33000 ముదిరాజులు,11000 పద్మశాలిలు ఉన్నారు. అందుకే బీసీలను విస్మరిస్తే టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని నేతలు అంటున్నారు.

Previous articleపవన్ కళ్యాణ్ యాత్రకు ప్రత్యేక బస్సు రెడీ!
Next articleవిశాఖ ఎంపీ సీటు చిన్నమ్మకు దక్కదా?