బీజేపీ వైపు చూస్తున్న తుమ్మల?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చిన మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఎప్పుడైనా పిడుగులు పడే అవకాశం ఉందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని తుమ్మల బుధవారం పార్టీ కార్యకర్తలకు సూచించారు. పిడుగులు ఎప్పుడైనా పడవచ్చు. పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనమందరం సిద్ధంగా ఉందాం అని అన్నారు. తుమ్మల గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఇటీవల భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యటించిన సమయంలో ఆయన గైర్హాజరు కావడం విశేషం. తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని, అనుచరులతో సక్రమంగా టచ్‌లో ఉండలేకపోయానన్నారు. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నానని, కార్యకర్తలు నన్ను ఆశీర్వదిస్తే అసంపూర్తిగా ఉన్న ఎజెండాను పూర్తి చేస్తానని చెప్పారు.
ఎప్పుడైనా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పడం ద్వారా తుమ్మల టీఆర్‌ఎస్‌ని వీడే సూచన చేసినట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం ఆయనతో గత కొంతకాలంగా టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. తుమ్మల భాజపాలో చేరితే ఖమ్మం జిల్లాలో కాస్త బలహీనంగా ఉన్న కాషాయ పార్టీకి పెద్ద బూస్ట్ అవుతుంది. పొరుగు జిల్లాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Previous articleఅమరావతి ర్యాలీ: బీజేపీ ఏం సందేశం ఇవ్వనుంది?
Next articleప్రకటనలు చేయడం మానేసి కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: రేవంత్