తొమ్మిది నెలలకు పైగా విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళిసై కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరుకావాలి. కాబట్టి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి కార్యక్రమానికి హాజరుకాకుండా దాటవేసే అవకాశం కేసీఆర్‌కు లేదు.వేడుకకు కొద్ది నిమిషాల ముందు కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. డాక్టర్ తమిళిసైకి పుష్పగుచ్ఛం అందించి, ఆమెతో ముచ్చటించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు దర్బార్ హాల్‌కు వెళ్లే ముందు ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా రాజ్‌భవన్‌లో కొత్త ప్రధాన న్యాయమూర్తి,గవర్నర్‌తో కేసీఆర్ కాసేపు గడిపారు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్టోబర్ 11,2021న కేసీఆర్ చివరిసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంపై ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి. సాంకేతిక కారణాలతో తమిళిసై తన నామినేషన్‌ను తిరస్కరించడం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది.
అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తూ ఆమెకు ప్రొటోకాల్ సౌకర్యాలు కల్పించడం మానేసింది. ఇక తమిళిసై కూడా కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడు వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు, తొమ్మిది నెలల తర్వాత, రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం లో భాగంగా ఇద్దరు నేతలూ రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు.