టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకొంటున్నట్లు సమాచారం. గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని బాలకృష్ణ ఇవాళ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఆహా ఓటిటీ లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.