ఏలూరు జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పర్యటనలో ఉన్నారు. జిల్లాలో దాదాపు పదికిపైగా మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు చెందిన పిల్లల చదువుల బాధ్యతను తాను చూసుకుంటానని జనసేన అధినేత కుటుంబాలకు చెప్పారు. ఈ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
తన పర్యటనలో భాగంగా చింతలపూడిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతులను, మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికార పార్టీ నేతలు తనను చంద్రబాబు దత్త పుత్రుడు అని అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జగన్‌ను తాను ఇప్పటికే సీబీఐకి దత్త పుత్రుడు అని పిలిచానని, అధికార పార్టీ నేతలు మళ్లీ దత్త పుత్రుడు అని పిలుస్తుంటే.. ఇంకా అలానే పిలుస్తానని పవన్ అన్నారు. తన జనసేనను టీడీపీ టీమ్‌బీ అని పిలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చంచల్‌గూడ షటిల్ టీమ్‌గా పిలుస్తానని చెప్పారు.
నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు అంతకుముందు బహిరంగ సభ అనంతరం తనకు ఫోన్ చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని చర్లపల్లి షటిల్ టీమ్‌గా పిలవకుండా సర్దిచెప్పారని చెప్పారు. “నరసాపురం ఎంపీ గారు కొన్ని విషయాల్లో నాకు సర్దిచెప్పి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహా తీసుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల సంక్షోభాన్ని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సృష్టించిందని, రైతులకు, కౌలు రైతులకు అండగా నిలవడంలో ఆ పార్టీ విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. “నాపై సెటైర్లు వేయడం మానేయండి. నేను స్క్రిప్ట్ రైటర్‌ని. నేను మంచి సెటైర్లు రాయగలను” అని జనసేన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను దత్త పుత్రుడు అని పిలవడం మానేయాలని కోరారు.