రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నా: ధర్మాన

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలోకి సీనియర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావును చేర్చుకుని, ఆయనకు ముఖ్యమైన రెవెన్యూ శాఖలన్నీ కేటాయించి వారం కూడా కాలేదు.
రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శనివారం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ధర్మానకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇంతవరకు అంతా బాగనే ఉంది. అయితే ధర్మాన మాత్రం రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వయస్సు వల్ల, నేను రాజకీయాలపై ఆసక్తిని కోల్పోతున్నాను. నేను రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నా.. కొత్త తరం రాజకీయ నాయకులకు మార్గం సుగమం చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఇంతటి కీలకమైన పదవి ఇచ్చి ఆనందోత్సాహాలతో ఉండాల్సిన మంత్రి నుంచి వస్తున్న మాటలు నిజంగానే ఆయన అనుచరులకు, వైఎస్సార్సీపీ వర్గాలకు షాకిచ్చాయి. అయితే ప్రజల ప్రేమ, అభిమానం వల్లే రాజకీయాల్లో కొనసాగాల్సి వచ్చిందని ధర్మాన అన్నారు.
ప్రజలు నాపై చూపుతున్న అభిమానం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి అడ్డుగా నిలుస్తోంది అని ఆయన అన్నారు. మంత్రి తన సొంత శాఖపై కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతి చాలా ఎక్కువ స్థాయికి వెళ్లిందని నాకు తెలుసు. శాఖలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాను అని అన్నారు.
పరిపాలనలో అవినీతిని అరికట్టడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టారని, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవినీతి రాజ్యమేలుతుందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నందుకు మనం సిగ్గుపడాలి అని ఆయన అన్నారు.కుల రాజకీయాలపై ధర్మాన అసహ్యం వ్యక్తం చేశారు.
పాలకులకు చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు నమ్ముతారు. కులం, మతం ప్రాతిపదికన ఓటు వేసే రోజులు పోయాయి. పంజాబ్‌లో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

Previous articleజనసేనను ‘జనతా గ్యారేజ్’తో పోల్చిన జోగయ్య!
Next article2024లో కాంగ్రెస్ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ రోడ్ మ్యాప్?