దాడి తిరుగుబాటు బావుటా !

మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరగకముందే వైఎస్సార్‌సీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రివర్గం పునర్విభజన తర్వాత భిన్నాభిప్రాయాలు వస్తాయని ఊహించారు. కానీ, సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాత్రం మంత్రివర్గం పునర్విభజన పూర్తి కాకముందే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా తనకు ఆహ్వానం అందలేదన్నారు.
అనకాపల్లి జిల్లాను సాధించేందుకు దశాబ్దాలుగా కష్టపడ్డానన్నారు.కానీ, వాస్తవానికి జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు,అధికారులు తనను ఆహ్వానించలేదని చెప్పారు.
దాడి వీరభద్రరావు గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో ఆయనకు వైరం ఉంది. అమర్‌నాథ్‌కు మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాల మధ్య ఆయనను రాజకీయాల్లో పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదన్నది ఆయన ఆవేదన.
ఇలా ప్రభుత్వం,అధికార పార్టీపై దాడి వీరభద్రరావు గళం విప్పారు. రఘురామకృష్ణంరాజు తర్వాత తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మొదటి వ్యక్తి ఆయనే. 2024 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.మరి అసమ్మతిపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం!

Previous articleఏపీలో అతి చిన్న జిల్లా ఏంటో తెలుసా?
Next articleరేవంత్‌కి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు?