రాజకీయాలకు, సినిమాలకు బంధం అన్నది ఏ నాటి నుంచో ఉంది. ఈ అనుబంధం అన్నది ముందుగా అమెరికాలో ఏర్పడినట్టు సమాచారం. తాము అభిమానించే పార్టీలకు బాహాటంగా మద్దతునిస్తూ, కొందరు సదరు పార్టీల్లోనూ సభ్యులుగా చేరడంతోనే ఈ అనుబంధం పురుడు పోసుకుంది. ఆ తరువాత ఆ స్థాయిలో అనుబంధం మన దేశంలోని తమిళనాడులోనే కనిపిస్తుంది. రామస్వామి నాయగర్ ద్రవిడ ఉద్యమం
సాగిస్తున్న సమయంలో ఆయన శిష్యగణంలో సినిమా రచయితలు అన్నాదురై, కరుణానిధి వంటి వారు ఉన్నారు. అంతే కాదు, పలువురు నటీనటులు తమ నాటకాల ద్వారా కూడా ద్రవిడ భావాలను జనంలోకి తీసుకువెళ్ళగలిగారు. అన్నా దురై ముఖ్యమంత్రి అయిన తరువాత కరుణానిధి ఆ స్థానం చేజిక్కించుకున్నారు. అదే తీరున కరుణానిధి ఓటమి అనంతరం ఎమ్.జి.రామచంద్రన్ గద్దెనెక్కారు. ఆ తరువాత నుంచీ ఇప్పటి దాకా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమా వారికి సంబంధించిన పార్టీలే తమిళనాడులో రాజ్యమేలుతూ వచ్చాయి. తెలుగునాట ఆ ముచ్చట అంతగా సాగలేదు. నిజానికి అన్నాదురై అదికారం చేపట్టిన సమయంలోనే తెలుగునాట కొంగర జగ్గయ్య కూడా ఒంగోలు నియోజకవర్గం నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తెలుగు రాజకీయాల్లో సినిమా తారల ప్రవేశం అన్నది జగ్గయ్యతోనే సాగినా, అది ఆ తరువాత ఊపందుకోలేక పోయింది. బహుశా, జగ్గయ్య ఓ పార్టీలో ఉండడం వల్ల సొంతగా రాజకీయ పోరాటం చేసే అవకాశం లభించిక పోయి ఉండవచ్చు. ఆ తరువాత తెలుగునాట తమిళనాడు స్థాయి రాజకీయాలకు శ్రీకారం చుట్టింది నిస్సందేహంగా నందమూరి తారక రామారావు అనే చెప్పాలి. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు రామారావు. ఆ స్థాయిలో ఏ సీనీ స్టార్ కూడా అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఘనవిజయం సాధించలేదు. తమిళనాడులోలాగా తెలుగునేలపై సినీతారలకు చెందిన పార్టీలు విజయం సాధించలేకపోయాయి. దాంతో ఒకే ఒక్క యన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే జనాల్లో నానుతోంది. ఆయన గతించి, 26 సంవత్సరాలయినా, ఇంకా ఆయన చుట్టూనే తెలుగు రాజకీయాలు, అప్పుడప్పుడూ జాతీయ రాజకీయాలు కూడా పరిభ్రమిస్తూ ఉండడం విశేషం!