మూడు రాజధానులపై సవరించిన బిల్లును మార్చి 21న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మీడియా కథనాలు, రాజకీయ వర్గాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి.
మార్చి 21న రాష్ట్ర అసెంబ్లీలో రాజధాని అంశంపై చర్చించి మూడు రాజధానులపై సవరించిన బిల్లుల ప్రవేశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపినట్లు కథనాలు వచ్చాయి. మూడు ప్రాంతాల అభివృద్ధి, శాసనసభ పనితీరులో హైకోర్టు జోక్యంపై కూలంకషంగా చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సలహా కమిటీలో ప్రతిపాదించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దీనిపై చర్చిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, అది న్యాయవ్యవస్థతో ప్రత్యక్ష ఘర్షణ తప్ప మరొకటి కాదు, ఎందుకంటే అది కోర్టు ధిక్కారానికి సమానం. హైకోర్టు ఆదేశాన్ని అమలు చేయాలా లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అన్నదానిపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి స్టాండ్‌ను బయటపెట్టలేదు.
గవర్నర్ ప్రసంగంలో కానీ, బడ్జెట్ ప్రసంగంలో కానీ అమరావతి అంశాన్ని గానీ, మూడు రాజధానుల అంశాన్ని గానీ ప్రభుత్వం ప్రస్తావించలేదు. అయితే, మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ క్యాబినెట్ సహచరులు పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత లేదని, పార్లమెంటు ఆమోదం పొందలేదని, జగన్ ప్రభుత్వం అమరావతిని శాసనసభ రాజధానిగా మాత్రమే పరిగణిస్తుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
కాబట్టి జగన్ ప్రభుత్వం మార్చి 21న అసెంబ్లీలో ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లును ప్రవేశపెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ పై చర్చకు మాత్రమే పరిమితం చేయకపోతే,మూడు రాజధానుల అంశంపై మాత్రమే తదుపరి ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఈ సమస్యను వీలైనంత కాలం లాగాలనుకుంటున్నారని అర్థం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.