జెయింట్ కిల్లర్లకు మంత్రి పదవులు దక్కేనా?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ నేతలను ఓడించిన ముగ్గురు జెయింట్ కిల్లర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించగా,మూడో వ్యక్తి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై విజయం సాధించారు. మొదటి టర్మ్‌లోనే వీరిలో కనీసం ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా, వారికి లభించలేదు.
మంగళగిరిలో లోకేష్‌పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తొలి విడతలోనే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా ఆయన నిరాశ మిగిలింది.ఈసారి మంత్రివర్గంలోకి స్థానం దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు.
జనసేన అధినేతను ఓడించిన ఇద్దరు ఎమ్మెల్యేలలో కనీసం ఒక్కరైనా ఈసారి మంత్రివర్గంలోకి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌పై తిప్పల నాగిరెడ్డి 16,573 ఓట్ల తేడాతో విజయం సాధించారు.2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా,2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు ఓడిపోయినా,2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై నాగిరెడ్డి విజయం సాధించారు.నాగిరెడ్డికి ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
భీమవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధి శ్రీనివాస్ కూడా ఈసారి మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన 8,357 ఓట్ల తేడాతో జనసేన అధినేతపై విజయం సాధించారు.
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ్రంధి శ్రీనివాస్‌ క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. వీరికి ఈసారైనా మంత్రివర్గంలో చోటు లభిస్తుందో లేదో వేచి చూడాలి

Previous articleసమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Next article2024లో కాపులు కొత్త చరిత్రను లిఖిస్తారా ?