నిరుద్యోగులకు తీపి కబురు అందించనున్న కేసీఆర్ !

లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం..
నిరుద్యోగ యువత ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం రేపు స్పష్టత ఇవ్వనుంది. శాసనసభ వేదికగా ఉద్యోగాల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. 75 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారా.. లేక లక్ష ఉద్యోగాల భర్తీ చేపడతారా అన్నది చూడాల్సి ఉంది. జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.ఉద్యోగాల భర్తీ కోసం యువత చాలారోజులుగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి పలు దఫాలుగా కసరత్తు చేసింది. అయితే వివిధ కారణాల రీత్యా నియామక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో తెరాస బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల కోసం రేపు శాసనసభలో ప్రకటన చేస్తానని చెప్పారు. యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలపై సీఎం రేపు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు. దీంతో ఎన్ని ఉద్యోగాల నియామకాలు చేపడతారన్న విషయమై చర్చ ప్రారంభమైంది.
శాఖల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. గతంలో చేసిన కసరత్తు ప్రకారం వివిధ శాఖల్లో 70 వేలకు పైగా ఖాళీలు గుర్తించారు. పోలీసు, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఎక్కువ పోస్టులు తేలాయి. అయితే అవకాశం ఉన్న అన్ని పోస్టులను గుర్తించే దిశగా సర్కార్ కసరత్తు చేసింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు సరిపడా పోస్టులు, కొత్త మండలాలు, అవసరమైన చోట పోస్టుల గుర్తింపు కోసం కసరత్తు చేశారు. పోస్టులకు సంబంధించి ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేసింది. అన్నింటి ఆధారంగా ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది.
తెలంగాణ వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా పోస్టుల స్థానంలో ఒప్పంద, పొరుగుసేవల పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో నికరంగా ఉండే ఖాళీల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఖాళీలు, నియామక ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు శాసనసభలో ప్రకటన చేయనున్నారు.
కొత్త స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఖాళీలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలతో పాటు జిల్లాల వారీగా ఉన్న ఖాళీలకు సంబంధించిన స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం ప్రకటన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. వనపర్తి పర్యటన నుంచి వచ్చాక ముఖ్యమంత్రి సైతం ఇందుకు సంబంధించి మంత్రి హరీశ్రావు, అధికారులతో చర్చించారు.

Previous articleపథకాల క్రెడిట్‌ను తీసుకోవాలను కుంటున్న కేంద్ర ప్రభుత్వం?
Next articleసంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు