వెలవెలబోతున్న తెలంగాణ టిడిపి కార్యాలయం !

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన తొమ్మిది నెలల క్రితం నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతపై ఎలాంటి సందేహం లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసింది. అయితే, ఆయన తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా తొమ్మిది నెలలు గడిచినా ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదు. పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసే విషయంలో కూడా ఆయన పట్టించుకోలేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు గురించి మాట్లాడుతున్నాం. ఎల్వీ రమణ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు.
కానీ, రోజూ బక్కని నర్సింహులు జూబ్లీహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు తొమ్మిది నెలల నుంచి వస్తున్నారు. తన ఛాంబర్‌లో కూర్చుని ఇంటికి వెళ్తారు.ఆయన అధికారికంగా ప్రమాణం చేయలేదు రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. గడిచిన తొమ్మిది నెలలుగా ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును పెద్దగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. గత తొమ్మిది నెలలుగా ఎటువంటి కార్యాచరణ లేదు,
అచరణాత్మకంగా ఏ కార్యక్రమం నిర్వహించలేదు.
ఒకప్పుడు తెలంగాణ సత్తా చాటిన టీడీపీ ఇప్పుడు నీడలా మారింది. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు పెద్దగా ఎవరూ రాకపోవడంతో వెలవెలబోతోంది. గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు కూడా కార్యాలయాన్ని సందర్శించడం మానేశారు.కొన్ని నెలలుగా ఆఫీసుకు వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని మాట వినడం లేదు, కనిపించడం లేదు, ఉనికిని చాటడం లేదు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి నామమాత్రంగానే ఉంది. ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్నారంటే ఉన్నారని అనుకోవాలి, తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీ ఖాళీ అనే చెప్పాలి. రాష్ట్ర విభజన నాటి నుంచి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ని నడిపించిన ఎల్ రమణే గుడ్బై చెప్పేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికి కొనసాగినా 2018 ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. వారిద్దరూ తెలుగుదేశం పార్టీ గుడ్బై అంటూ టీఆర్ఎస్ గూటిలోకి వెళ్లిపోయారు
గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటైనా సీటు వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. ఒకప్పుడు కార్యకర్తలు.. నాయకుల రాకపోకలతో కళకళలాడిన పార్టీ ఆఫీస్.. ఇప్పుడు ఎవరోస్తారా.. తాళం ఎవరు తీస్తారా ? అని ఎదురు చూడాల్సిన దుస్థితి. తెలంగాణలో తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నప్పటికీ సరైన దిశానిర్దేశం చేసే వారు లేకపోవడంతో కార్యకర్తలు అయోమయం నెలకొంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పై చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

Previous articleవైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు పీవీపీ ప్రయత్నం?
Next articleచిన్ని గుండెకు మహేష్ బాబు అండ