అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ “ఆర్ ఆర్ ఆర్”లపై సస్పెన్షన్ వేటు!

అసెంబ్లీలో తన మాజీ మంత్రి ,మాజీ సహచరుడు ఈటల రాజేందర్ ముఖాన్ని ప్రతిపక్ష బెంచీల్లో చూడడానికి ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ ఒక్కరోజు మాత్రమే కాదు, బడ్జెట్ సెషన్ మొత్తానికి, బిజెపి శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ముఖ్యంగా టిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరి హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికై అసెంబ్లీకి వచ్చిన ఈటల రాజేందర్ తిరిగి అసెంబ్లీ వచ్చిన ముఖాలను చూడడానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. గత నవంబర్‌లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల ఎన్నికయ్యారు. ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు ఎం రఘునందన్ రావు,టి రాజా సింగ్, ఈటల రాజేందర్ వాస్తవానికి సభలో పెద్దగా గందరగోళం సృష్టించలేదు.
బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి దూరంగా ఉండే ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి నినాదాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు బిజెపి సభ్యులు తమ సీట్లలో నిలబడి నిరసన తెలుపుతున్నారు వారు పోడియంపైకి దూసుకెళ్లడం గానీ, ఎలాంటి రచ్చ సృష్టించడం గానీ, పెద్దఎత్తున నినాదాలు చేయడం గానీ చేయలేదు.
హరీష్‌రావు ప్రసంగం సజావుగా సాగుతున్న తరుణంలో ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు మాత్రమే కాకుండా మొత్తం అసెంబ్లీ సమావేశాలకే సస్పెండ్ చేసింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానాన్ని చదివి ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
మరోవైపు గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంతో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. సభను ప్రోరోగ్ చేయనందున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.

Previous articleసినిమా టిక్కెట్ రేట్ల ఫైలుపై సంతకం చేసిన జగన్!
Next articleఎన్నికల ఎజెండాతో త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ భేటీ !