టిడిపి అగ్రనాయకులు మధ్య ఆధిపత్య పోరు !

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళులాగా ఉండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించాల్సిన నాయకులు వారి బాధ్యతను మర్చిపోయారు .వారిద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు తో పార్టీని కష్టాల్లోకి నెట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ నేతల లో ఇంకా మార్పు రాలేదు, ఆధిపత్యపోరు తో పార్టీ ప్రతిష్ఠను మంట కలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు గా చలామణి అవుతున్న వీరిద్దరూ సొంత పార్టీలోనే ఆధిపత్యపోరు చీలికలు తెస్తున్నారు.
ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ ?
శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీకి కంచుకోట. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు ఒకటి , రెండు సార్లు మినహా తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు, మెజార్టీ స్థానాలు టీడీపీ కట్టబెడుతున్నారు. గత 2019ఎన్నికల్లో వైసీపీ గాలిలో కొన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా, శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. ఇంకొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీకి గట్టిపట్టున్న శ్రీకాకుళం జిల్లా పై చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా శ్రీకాకుళం నేతలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు శ్రీకాకుళం జిల్లా కు చెందిన వారే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , గత అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బలమైన నాయకులే. తెలుగుదేశం అధిష్టానం నమ్మి బాధ్యతలు అప్పగించింది. అలాంటప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే గాడిలో పెట్టవలసిన వారిద్దరి మధ్య ఆధిపత్యపోరు తో కార్యకర్తలు నలిగిపోతున్నారు.
అచ్చెన్నాయుడు, కళావెంకట్రావుల మధ్య పోరు టీడీపీకి తలనొప్పిగా మారిందట. ఎప్పటి నుంచో ఇద్దర మధ్య ఆధిపత్యపోరు ఉన్నా ప్రస్తుతం అది ముదిరింది అంటున్నారు. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్నాయుడు తెరవెనక పావులు కుదుపుతున్నరన్నది కళా వెంకట్రావు వర్గం ఆరోపిస్తోంది. అవే ఆరోపణలు తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అధికారపార్టీ వర్సెస్ విపక్ష పార్టీగా ఉండాల్సిన రాజకీయం, సొంతపార్టీ నేతల మధ్య వర్గ పోరుగా తయారైంది.
మాజీ మంత్రి కళా వెంకట్రావు వర్గానికి చెందిన కొందరు కీలక నేతలను అచ్చెన్నాయుడు టార్గెట్
చేస్తూన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియెజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్నాయుడు ఎసరు పెడుతున్నట్టు కళా వెంకట్రావు వర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతాచోట్ల ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ లు కళావెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది. దీంతో వారందర్నీ అచ్చెన్నాయుడు పక్కన పెడుతున్నారన్నది వారి వాదన. అయితే ఇలాంటి రాజకీయాలు కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాలో కుదటపడదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Previous articleశ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్యకు కుట్ర ఒక డ్రామా :బండి సంజయ్
Next articleఎంపీ అవినాష్ రెడ్డి కి కోర్టు ద్వారా నోటీసులు ?