వైయస్సార్సీపి ప్రధాన కార్యదర్శి, పార్టీ లో నెంబర్ టు గా పిలవబడుతున్న విజయసాయిరెడ్డికి తిరిగి మళ్లీ రాజ్యసభకు జగన్ నామినేట్ చేస్తారా? ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశం లేదని వైఎస్సార్సీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుత పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది . పదవీకాలం ముగిసిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో ఆయన పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డి పదవీ కాలం జూన్ 21తో ముగియనున్న ఈ నాలుగు స్థానాలను మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది .ఈ నేపథ్యంలో జగన్ రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రధానంగా కొంతమంది పేర్లు ఎక్కువగా చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెజారిటీ కారణంగా వైఎస్సార్సీపీ నాలుగింటిని గెలుచుకుంటుంది.
విజయసాయిరెడ్డి స్థానంలో వై వి సుబ్బారెడ్డి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.అవినాష్‌రెడ్డి,మిథున్‌రెడ్డి ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని జగన్ భావిస్తున్న నేపథ్యంలో సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీకి పంపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని కళింగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కిల్లి కృపా రాణి ఈసారి రాజ్యసభ ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు మరో ఎంపీ సీటును అదానీ గ్రూపు కి ఇవ్వవచ్చు. సంఖ్య పరంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో నాల్గవ సీటు కాపు నాయకుడికే దక్కుతుంది వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారట.
ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది. నెల్లూరుకు టిడిపి చెందిన బీద మస్తాన్‌రావు కు రాజ్యసభ ఇస్తామనే హామీ ఇచ్చి ఆయనను వైకాపాలో చేర్చుకున్నారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు 2019 ఎన్నికలకు ముందు మంత్రిని చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. మర్రి రాజశేఖర్ కు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరుగుతోంది .
రాష్ట్రంలో వైసిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజయసాయిరెడ్డిని ముఖ్యమంత్రి జగన్ కోరవచ్చు.ఆయనకు అన్ని పార్టీల అనుబంధసంస్థల బాధ్యతలు ఇప్పుడే అప్పగించారు.పార్టీల అనుబంధసంస్థల పునరుద్ధరించి బలోపేతం చేయాలని విజయసాయిని కోరనున్నారు.విజయసాయి రెడ్డిని పార్టీ బలోపేతం చేసేందుకు ఇక్కడే ఉంచుతారా? లేక ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టేందుకు రాజ్యసభకు పంపిస్తారని అనేది చూడాలి.