తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో తన రాజకీయ ప్రత్యర్థులను కిడ్నాప్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వరుస కిడ్నాప్‌లు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించడమే కాకుండా మీడియా దృష్టిని ఆకర్షించాయి.
2018 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి తన ఎన్నికల అఫిడవిట్‌ను తారుమారు చేశారని ఆరోపిస్తూ శ్రీనివాస్ గౌడ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఢిల్లీలో కిడ్నాప్ అయ్యారు. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఆయన ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేయడంపై భారత ఎన్నికల సంఘం కూడా విచారణకు ఆదేశించింది. ఇది ఇలా ఉండగా మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో కిడ్నాప్‌కు గురయ్యారు. వీరంతా శ్రీనివాస్ గౌడ్ పై ఫిర్యాదు చేసిన వారికి సంబంధించినవారే.
వీరు ప్రస్తుతం బీజేపీలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. కొద్ది మంది వ్యక్తులు రెడ్డి నివాసానికి కారులో వచ్చి వారిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సిఎం కెసిఆర్‌తో కలిసి సోమవారం రాత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీకి చేరుకోవడం, శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఈ కిడ్నాప్ ఘటన జరగడం విశేషం. దీంతో ఈ కిడ్నాప్‌లలో శ్రీనివాస్ గౌడ్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ గౌడ్ రాజకీయ ప్రత్యర్థుల కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.