“ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్
ఇంకా ఎవరికీ ఇవ్వలేదు!!

మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం ప్రకటించారు. “ఉడుంబు” చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన “ఉడుంబు” మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు.
పలు అగ్రనిర్మాణ సంస్థలు “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ… ఇంకా ఈ చిత్రం హక్కులు ఎవరికీ ఇవ్వలేదని కె.టి.తమరక్కుళం స్పష్టం చేశారు.
ఇప్పటివరకు మలయాళంలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన చిత్రాలు దాదాపుగా అన్నీ ఇక్కడ కూడా అఖండ విజయం సాధించాయి. విక్టరి వెంకటేష్ “దృశ్యం, దృశ్యం-2″లతోపాటు ఇటీవల విడుదలై అప్రతిహత విజయం సాధిస్తున్న “భీమ్లా నాయక్” ఇందుకు తాజా ఉదాహరణ. అలాగే మెగాస్టార్ నటిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రం కూడా మలయాళంలో రూపొంది సంచలన విజయం సాధించిన “లూసిఫర్”కు రీమేక్ అన్న విషయం కూడా ఇక్కడ గమనార్హం. ఈ నేపధ్యంలో మళయాళంలో మంచి హిట్టయిన సినిమాలకు తెలుగులో మరింత క్రేజ్ ఏర్పడుతోంది.
భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన “ఉడుంబు” చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా… తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు.
మరి ఇంతటి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ఎవరి సొంతం కానున్నాయో వేచి చూడాల్సిందే!!

Previous article
Next articleSarkaruVaariPaata wishes everyone a Happy Shivaratri.