గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు !

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ అడుగుజాడలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గవర్నర్ ప్రసంగం లేకుండా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాలనినిర్ణయించారు. మార్చి 7న సమావేశాలు ప్రారంభమవుతాయి ,అదే రోజు 2022-23 బడ్జెట్‌ను సమర్పించనున్నారు.ఈ నెల ప్రారంభంలో, పశ్చిమ బెంగాల్ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి, ఇది ప్రతిపక్ష బిజెపి నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గ సహచరులు , సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మార్చి 7 నుండి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 2022-23 బడ్జెట్‌ను ఆమోదించడానికి మార్చి 6 న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు మార్చి 7న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారని.. సమావేశాల వ్యవధిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం తెలంగాణలో ఇదే తొలిసారి. ప్రతి సంవత్సరం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు రెండుసార్లు ప్రారంభమయ్యాయి. 1970, 2014లో అప్పటి అసాధారణ పరిస్థితుల కారణంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
కేంద్రంతో తలపడుతున్న కేసీఆర్ గవర్నర్ తమిళ సై ను ఇటీవలి కాలంలో లెక్క చేయడం లేదు. గవర్నర్ వ్యవస్థ ఉనికిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. మేడారం పర్యటనకు హెలికాప్టర్ ఇవ్వకపోవడమే కాదు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంప్రదాయబద్దంగా అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని కూడా వద్దనుకుంటున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ గవర్నర్తో ప్రసంగం ను రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయవు.ఇది రాజ్యాంగ సంప్రదాయంగా ఉంది.ఈసారి అధికారికంగా ఎటువంటి కారణం చెప్పలేదు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ,కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Previous articleకొత్త జిల్లాల వివాదాలపై జగన్ ను ప్రశ్నించిన గవర్నర్ !
Next articleకాపు ఐక్య ఉద్యమాల వెనుక బీజేపీ హస్తం ఉందా?