కొత్త జిల్లాల వివాదాలపై జగన్ ను ప్రశ్నించిన గవర్నర్ !

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హడావుడిగా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి, కొత్త జిల్లాల ఏర్పాటు పై ఉన్న వివాదాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతితో కలిసి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. దాదాపు అరగంటకు పైగా గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించారు.

ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల సరిహద్దులు మార్చడం, స్థానికుల అభీష్టానికి విరుద్ధంగా కొన్ని జిల్లాలను కొత్త జిల్లాల్లో కలపడంపై ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని గవర్నర్‌ పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. గవర్నర్ లేవనెత్తిన సందేహాలన్నింటిని నివృత్తి చేసిన జగన్, స్థానికుల అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, వారిని ఒప్పించిన తర్వాతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

నెల్లూరు మినహా మెజారిటీ కొత్త జిల్లాలకు ఎలాంటి అభ్యంతరం లేదని, నెల్లూరు సమస్యను కూడా సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తామని జగన్ గవర్నర్‌కు చెప్పారు. తమ ప్రభుత్వం ఏప్రిల్‌లో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేస్తుందని, దీనివల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతూకంగా, సమ్మిళితంగా అభివృద్ధి చెందుతాయని జగన్ గవర్నర్‌కు చెప్పారు.

Previous articleపీకేని నియమించడం టీఆర్‌ఎస్‌కు ప్లస్‌ కాదా?
Next articleగవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు !