తెలుగుదేశం సీనియర్ నేత యడ్లపాటి కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు.
యడ్లపాటి వెంకట్రావు 1967,1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం 1983లో తెదేపా చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి జీవితం ఎంతో ఆదర్శమన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి గుర్తుండిపోతారని చెప్పారు.
రైతు నాయకుడు యడ్లపాటి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తన తండ్రి హయాం నుంచి తమ కుటుంబానికి యడ్లపాటితో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తాను ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడని చెప్పిన ధూళిపాళ్ల.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
యడ్లపాటి మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని లోకేష్ అభిప్రాయ పడ్డారు. మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

Previous article17 లోక్‌సభ సీట్లతో కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారు?
Next articleఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం..