తెలుగు తెరపై నటరత్న నందమూరి తారక రామారావుకు ముందు, తరువాత ఎందరు నటులు శివుని పాత్రలో నటించినా, ఆ మూర్తిలాగా పరమశివునిలా సరితూగిన వారు లేరు. యన్టీఆర్ తొలిసారి శివుని పాత్రలో నటించిన చిత్రం దక్షయజ్ఙం
(1962). రామారావుకు తొలినుంచీ గురువులను, పెద్దలను గౌరవించడం అలవాటు. తనకు అనేక చిత్రాలలో తల్లిగా నటించిన కన్నాంబ అన్నా, ఆమె భర్త ప్రముఖ నిర్మాత, దర్శకులు కడారు నాగభూషణం అన్నా యన్టీఆర్ కు ఎంతో గౌరవం! వారిపై ఎంత గౌరవం అంటే, కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు కోరగా వారు నిర్మించిన సతీ అనసూయ
(1957) చిత్రంలో కాసేపు అతిథి పాత్రలో కనిపించారు. అందులో కురూపి అయిన కౌశికుడిని అనసూయకు అత్యంత ప్రియమైన అమ్మాయి నర్మద పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. అనసూయ లాగే నర్మద సైతం తన పాతివ్రత్యంతో కురూపి అయిన భర్త రోగాన్ని పోయేలా చేస్తుంది. ఆ కురూపి కౌశికుడు తరువాత అద్భుతమైన అందగాడుగా మారతాడు. కురూపి పాత్రలో సినిమా అంతా కేవీయస్ శర్మ కనిపిస్తాడు. అందగాడుగా మారగానే యన్టీఆర్ తెరపై దర్శనమిస్తారు. ఆ కొద్ది నిమిషాల సేపు కనిపించే పాత్రను పోషించమని రామారావును కోరగానే మరోమాట లేకుండా అంగీకరించారు యన్టీఆర్. తరువాత కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులు అడగగానే, వారు నిర్మించిన దక్షయజ్ఞం
లో శివునిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో జనాదరణ పొందింది. అయితే ఈ చిత్రం సమయంలో యన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మరణించాడని, అందువల్లే తరువాత రామారావు శివుని పాత్ర పోషించలేదనే కట్టు కథ మాత్రం ఈ నాటికీ సంచారం చేస్తూనే ఉంది. కరుణామయుడైన శివుడు కరుణిస్తాడే కానీ, కన్నెర్ర చేయడు కదా! ఈ సినిమా యన్టీఆర్ 99వ చిత్రంగా 1962 మే 10న విడుదలయింది. మరుసటి నెలలోనే రామారావు నటించిన 100వ చిత్రంగా గుండమ్మ కథ
జూన్ 7న జనం ముందు నిలచింది. ఇక తెలుగులో గుండమ్మ కథ
ఘనవిజయానికి యన్టీఆర్ అనితరసాధ్యమైన అభినయమే కారణమని చెప్పక తప్పదు. ఇందులో ఏయన్నార్ కూడా మరో హీరోగా నటించారు. మరి ఆయన కూడా ఈ విజయానికి కారకులవుతారు కదా అనే అనుమానం రావచ్చు. అదే ఏయన్నార్ గుండమ్మ కథ
తమిళ వర్షన్ లో తెలుగులో పోషించిన పాత్రలోనే ధరించారు. అందులో యన్టీఆర్ పాత్రను జెమినీ గణేశన్ పోషించారు. ఆ సినిమా పేరు మనిదన్ మారవిల్లై
. ఈ చిత్రం ఏయన్నార్ కు నూరవ సినిమా కావడం విశేషం. అయితే మనిదన్ మారవిల్లై
తమిళంలో అపజయం పాలయింది. మరి గుండమ్మ కథ
లో యన్టీఆర్ నటించిన తీరుకు జేజేలు పలకవలిసిందే కదా! గుండమ్మ కథ
ఘనవిజయం సాధించడంతో దక్షయజ్ఙం
అంతగా రంజింప చేయలేకపోయింది. అంతే తప్ప ఆ సినిమాలో నటించడం వల్ల యన్టీఆర్ ఇంట ఏ లాంటి అశుభాలూ జరగలేదు. పైగా ఆ యేడాది దక్షయజ్ఞం
కు ముందు వచ్చిన రామారావు చిత్రాలు గులేబకావళికథ, గాలిమేడలు, భీష్మ
విజయదుందుభి మోగించాయి. తరువాత వచ్చిన గుండమ్మ కథ
తో పాటు మహామంత్రి తిమ్మరుసు, రక్తసంబంధం, ఆత్మబంధువు
చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అంటే దక్షయజ్ఙం
వల్ల రామారావుకు ఏ లాంటి నష్టం వాటిల్లలేదనే కదా!

దక్షయజ్ఞఃం
చిత్రం రిపీట్ రన్స్ లో అనేక కేంద్రాలలో వసూళ్ళ వర్షం కురిపించింది. ఆ రోజుల్లో ఎంతోమంది చిత్రకారులు ఇందులోని యన్టీఆర్ గెటప్ ను పెట్టుకొని శివుని బొమ్మలు రూపొందించేవారు. ముఖ్యంగా కేలండర్స్ లో ఇప్పటికీ దక్షయజ్ఞఃం
లోని యన్టీఆర్ శివుని బొమ్మలు దర్శమిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం తరువాత తన గురువు కేవీ రెడ్డి కోరగా యన్టీఆర్ ఉమాచండీ గౌరీశంకరుల కథ
(1968)లో మరోమారు శివుని పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే ఆ యేడాది కూడా యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఆ యేడాది బ్లాక్ బస్టర్ రాము
లో కూడా రామారావే హీరో! కాబట్టి యన్టీఆర్ శివుని పాత్రవేస్తే ఆయనకు అశుభాలు జరిగాయని వినిపించే కథలను కొట్టిపారేయవలసిందే!