ఏపీలో మారుతున్న రాజకీయాలు..! రాజ్యాధికారాన్ని కోరుతున్న కాపులు.. !!

కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు కాపు నాయకులు, మాజీ అధికారులు ఆదివారం వైజాగ్‌లో కలిసి కాపు సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రస్తుత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కాపు సామాజికవర్గాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తోంది, వివక్ష చూపుతోంది , అవమానిస్తోంది, కాపులు ఏ విధంగా సంఘటితమై ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రధాన రాజకీయ శక్తి’గా ఎదగాలనే దానిపై కూడా చర్చించారు.
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ, మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, మాజీ ఐఏఎస్ అధికారి భాను, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కాపు సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.
గతంలో హైదరాబాద్ సమావేశానికి హాజరైన నేతలు కూడా ఈ సారి హాజరు కాలేదు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్, బోండా ఉమా, గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్ అధికారి భాను హాజరయ్యారు. వంగవీటి రాధా, మాజీ ఐపీఎస్ లక్ష్మినారాయణ వంటి వారు ఈ సారి కనిపించలేదు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అమలుపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, కాపు సామాజికవర్గ సంక్షేమాన్ని విస్మరించినా వైఎస్సార్‌సీపీలోని కాపు నేతలు మౌనం వహించడం పై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కాపుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసేందుకు “ఫోరం ఫర్ బెటర్ ఏపీ” ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భవిష్యత్తులో ఫోరం రాజకీయ వేదికగా మార్చాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు .ఈ పరిణామంపై అధికార వైఎస్సార్‌సీపీలోని కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Previous articleమీడియా కథనాలపై అవినాష్ రెడ్డి మౌనం.. ?
Next articleటిఆర్ఎస్ నేతలు హరీష్ రావును నమ్మట్లేదా!