వెంకయ్యకు రాష్ట్రపతి పదవి దక్కేనా..?

మరో కొద్ది నెలల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి . మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి.రాష్ట్రపతి కావాలనే ఆకాంక్షగానీ,అవ్వాలనే కోరిక గానీ తనకి లేదని వెంకయ్య నాయుడు ఇప్పటికే చెప్పేశారు.ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారా ? అయ్యే అవకాశం ఉందా ? ఒకవేళ అదే జరిగితే దేశం అంతా ఓ లెక్క.ఆంధ్ర ప్రదేశ్ లోమాత్రం మరో లెక్క. ముఖ్యంగా వైసీపీ ఉలిక్కిపడుతుంది.
వెంకయ్య నాయుడు ఢిల్లీలో పవర్ లో ఉన్న ప్రతీసారి ఇక్కడ చంద్రబాబే ముఖ్యమంత్రి.వెంకయ్య నాయుడు ప్రభావం ఎంత ఉందనేది పక్కనపెడితే,ఇదే వాస్తవం. అందుకే వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా అనేది కీలక ప్రశ్నే! వాజ్ పేయి హయాం నుంచి ఢిల్లీలో క్రియాశీలంగా ఉన్నారు .వెంకయ్య రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకుండా చేసేందుకే ఆయన్ని ఉపరాష్ట్రపతిని చేశారు మోడీ, అమిత్ షా లు,ఇది బహిరంగ రహస్యం .
75 ఏళ్లు దాటిన వాళ్లు క్రియాశీలక రాజకీయాల నుండి దూరంగా ఉండాలని అద్వానీ, జోషీ లాంటి వాళ్లని తప్పించారు. అరుణ్ జైట్లీ , సుష్మా స్వరాజ్,అనంతకుమార్లు మరణించారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ ఇలాంటి వాళ్ళని తప్పించారు ఇక క్రియాశీలకం మిగిలింది రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ లు మాత్రమే.యోగీ ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యాక, రాజ్ నాథ్ సింగ్ కొడుకుపై ఆ మధ్య ఏవో ఆరోపణలు వచ్చాక ఇక ఆయన కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఆయన శాఖ ఏదో ఆయన చూసుకుంటున్నట్టు ఉన్నారు.ఇక ఎటొచ్చీ గడ్కరీ ఉన్నారు.ఆయన ఈ మినహాయింపులకే పెద్ద మినహాయింపు. ఆర్ఎస్ఎస్ నాయకులతో నితిన్ గడ్కరీకి సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయన కలిసి వచ్చిన అంశం.
రాష్ట్రపతి ఎన్నికలు 2022 జూలైలో జరుగుతాయ్.అంటే సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అవగానే. యూపీలో గెలిస్తే ఓ లెక్క.ఎందుకంటే పూర్తి సంఖ్యాబలం ఉంటుంది. ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో బొటాబొటీగా గెలవొచ్చు అని సి ఓటర్ సర్వేలో చెప్పింది. అదే జరిగితే లెక్క మారుతుంది. పూర్తి మెజారిటీ లేకపోతే,విపక్షాల్ని కూడా మద్దతు అభ్యర్థించాల్సిన పరిస్థితి ఉంటే కనుక,అప్పటి సంఖ్యాబలాన్ని బట్టీ, వెంకయ్య నాయుడు కు అవకాశం బీజేపీ ఇవ్వొచ్చునేమో.ప్రతిపక్షాల్ని ఒప్పించి మీరు మద్దతు కూడగట్టుకోండి అని అనవచ్చు. ఎందుకంటే మోడీ మీద విపక్షాల్లో సానుకూలత లేదిప్పుడు.అలాంటప్పుడు ఇదో అవకాశం అవ్వొచ్చు.
అలా కాకుండా బీజేపీ ఉత్తరప్రదేశ్ ని గెలుచుకుంటే కనుక కాస్త అటూ ఇటూగా 200 దగ్గర ఆగితే మాత్రం సమీకరణం మరోలా ఉంటుంది.ఈసారి, అంటే 2024లో బీజేపీకి మెజారిటీ రాదని తేలిపోతుంది. అలాంటప్పుడు కొత్త మిత్రులు, సానుకూల పార్టీలూ అవసరం అవుతాయ్. ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడు అవసరం పడొచ్చు. ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షా లు పవర్ గేమ్ ఆడేశారు. మధ్య ప్రదేశ్ లాంటి చోట్ల అడ్డంగా విపక్షాన్ని విరిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేశారు.ఇలాంటి వాటికి ఏదో రోజు మూల్యం చెల్లించాల్సి న సమయం వస్తుంది. 2024 ముందే అలాంటి సంకేతం కనిపిస్తే వెంకయ్య నాయుడు రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం అయ్యే అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఒక్కటే కండిషన్.
ఉత్తరప్రదేశ్ లో బొటాబొటీ అయితే వెంకయ్య రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వొచ్చు అంటున్నాం. అదే రకంగా ఉత్తరప్రదేశ్ లో అలా అయితే బీజేపీ వెంకయ్యకి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వొచ్చునేమో అని కూడా అంటున్నాం. అవకాశం వస్తే, వెంకయ్య వదులుకుంటే పరిస్థితి మరోలా ఉండొచ్చు.ఈ రెండూ కాకుండా, బీజేపీ ఒకవేళ వెంకయ్య నాయుడు కు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకపోయినా ఆయన క్రియాశీలకం అయ్యే పరిస్థితి రావొచ్చు. ఇక 75 ఏళ్ల నిబంధన ఉందీ అనుకున్నా వెంకయ్య నాయుడు కి అప్పటికీ ఇంకా సమయం ఉంటుంది దాదాపుగా.మోడీకి కూడా ఇంచుమించు అదే వయసు. మరి అలాంటి నిబంధనకి సడలింపులు, మినహాయింపు వస్తాయేమో కూడా చూడాల్సిఉంది.
ఉత్తరప్రదేశ్ ఫలితాల్ని బట్టీ మోడీ ప్రభ తగ్గుతోంది ఆరెస్సెస్ అర్థం చేసుకుంటే మాత్రం బీజేపీలో సమీకరణలు మారతాయ్.వెంకయ్య నాయుడుకి ప్రయారిటీ రావడంతోపాటు,నితిన్ గడ్కరీకి ప్రాధాన్యత పెరుగుతుంది .అదే జరిగితే పొత్తుల వేట,మిత్రుల కోసం తహతహ లాంటివి అన్నీ ఉంటాయ్.ఇలాంటి సమయంలో సంధానకర్తగా వెంకయ్య నాయుడు అవతరించే అవకాశం ఉంటుంది.ఎందుకంటే అమిత్ షా మోడీ ఇద్దరూ ప్రమాద కారుల ని మిగతా పార్టీలు,ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు నిర్ధారణకి వచ్చేశాయ్.ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడు అవసరం పడుతుంది.
అదే జరిగితే దేశం మొత్తం ఎలా ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం సమీకరణ అమాంతం మారుతుంది.టీడీపీ గ్రాఫ్ పెరిగింది, తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ భావిస్తే గేమ్ మొత్తం ఛేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు.ఇదంతా జరగడానికి సరిగ్గా కొంత సమయం పట్టొచ్చు.వైసీపీ నాయకులు ఆంతరంగిక సంభాషణల్లో వ్యూహాత్మకంగా ఓ మాట చెబుతుంటారు. వచ్చే జూలై నాటికి ఓ నాయకుడికి పదవీకాలం అయిపోతుంది.అంతకు ముందు జూన్ లోనే ఓ నాయకుడి టెన్యూర్ పూర్తి అవుతుంది.ఇక ఆగస్టు నాటికి ఆ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయన కూడా రిటైర్ అవుతాడు.ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయ్ అంటూ ఉంటారు.

నిజమే,పరిణామాలు వేరుగానే ఉండొచ్చు.అయితే వాళ్లకి అనుకూలంగానా,ప్రతికూలంగానా అనేది కూడా పాయింటే కదా !ఎందుకంటే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్నీ మొదటి మూడేళ్లు లోనే వాడేశాక,ఇక మిగతా రెండేళ్లు ఏం ఎదురొస్తాయో ! ఎదురుచూడాలి మరి.రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయ్యే అవకాశం లభిస్తుందా లేదా ? క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా ? అనేది వేచి చూడాలి.

Previous articleసోనియా, రాహుల్ ని కలిసే వరకు రాజీనామా చేయను !
Next articleయూపీ ఎన్నికల తర్వాత తెలంగాణ లో ఏం జరగనుంది…?