సోనియా, రాహుల్ ని కలిసే వరకు రాజీనామా చేయను !

సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గా రెడ్డి పార్టీకి మార్చి 21 వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, నమ్మకమైన సైనికుడిలా పని చేస్తానని చెప్పారు.తన రాజీనామాపై చాలా రోజులుగా సాగిన నాటకీయతకు ముగింపు పలికిన జగ్గారెడ్డి నియోజకవర్గంలోని తన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి, పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని వారికి చెప్పారు. ఇతర నియోజక వర్గాల్లో 35000 మంది సభ్యత్వాలు నమోదు చేసుకోగా, సంగారెడ్డిలో 9000 మంది మాత్రమే డిజిటల్‌గా నమోదు చేసుకున్నారని పార్టీ కార్యకర్తలకు తెలిపారు. మార్చి 21 నాటికి కనీసం 75000 మందిని చేర్చుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అలాగే సంగారెడ్డిలో బల నిరూపణగా లక్ష మందికి పైగా జనంతో భారీ పార్టీ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. త్వరలో ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తానని, టీఆర్‌ఎస్‌పైనా, భారతీయ జనతా పార్టీపైనా విమర్శలు గుప్పించారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ఆందోళనల వైపు పార్టీ దృష్టిని ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు.టిపిసిసి చీఫ్ తో వ్యక్తిగతంగా చర్చించడానికి ప్రతిపాదించగా తిరస్కరించారు .వి హనుమంత రావు, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క,దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి నాయకులు ఆయనను కాంగ్రెస్‌ను వీడకుండా నిరోధించడానికి వ్యక్తిగతంగా కలిశారు. ఏఐసీసీ నేతలు కూడా ఆయనకు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. తద్వారా ఆయన తన ఆందోళనల వైపు ఏఐసీసీ దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించారు. సోనియా గాంధీ ,రాహుల్ గాంధీని కలిసి వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు జగ్గా రెడ్డి .

Previous articleఅసంతృప్తులను బుజ్జగించే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం !
Next articleవెంకయ్యకు రాష్ట్రపతి పదవి దక్కేనా..?