బిజెపితో,తెలుగుదేశం కలిసి ఎన్నికల బరిలోకి దిగితే..!

సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన సోనియా గాంధీ అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఇప్పటికీ వ్యక్తం అవుతోంది. సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారని నిన్నటి వరకు మెజార్టీ ఓటర్లు భావించారు. తాజాగా సోనియాగాంధీపై కన్నా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపైనే మెజార్టీ ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు.

సోనియా గాంధీ అన్యాయమే చేశారు. నరేంద్ర మోడీ నమ్మించి నమ్మకంగా మోసం చేశారని మెజార్టీ ఓటర్లు భావిస్తున్నట్లు పలు చర్చల సందర్భంగా అధికార పార్టీనేతలు, బిజెపి నేతలు తప్ప మిగతా రాజకీయ పార్టీల నేతలందరూ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా.. ఓటర్లలో వ్యతిరేకత రాదు. బిజెపితో మళ్లీ చంద్రబాబు పొత్తు
పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేస్తే.. మళ్లీ భవిష్యత్తులో అధికారం చంద్రబాబు కు లభించదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ సారి తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై అటు మేధావులు, ఇటు తెలుగుదేశం పార్టీ మేధావులు, కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జనసేనాదిపతి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే మెజార్టీ ఓటర్లు ఆమోదించి.. ఆ రెండు పార్టీలకు బ్రహ్మరధం పడతారని.. ఒకవేళ బిజెపితో కూడా పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే ఆ రెండు పార్టీలకు అసలుకే ఎసరు వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాష్ట్రంలో నరేంద్రమోడీ, అమిత్‌షాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికలలో చంద్రబాబును ఓడించి జగన్ అందలం ఎక్కించిన ఆ ఇద్దరు నేతలు రాష్ట్రాభివృద్దిని తెర వెనుకుండి పరోక్షంగా అడ్డుకున్నారని మేధావులు భావిస్తున్నారు. నరేంద్రమోడీ పేరు చెబితేనే.. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారని.. బిజెపి నేతలే తెర వెనుక చెబుతున్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ అని ఆశ చూపించి అరచేతిలో వైకుంఠం చూపించారు.

ఢిల్లీని మించిన రాజధానిని అమరావతిలో నిర్మించేందుకు సహకరిస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ ఇంత వరకు అమలు చేయలేదు. ముందు ముందు అమలు చేసే పరిస్థితులు కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత త్వరగా బిజెపితో పొత్తును తెగ తెంపులు చేసుకుని టిడిపితో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే అధికారం దక్కుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Previous articleప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ లో చేరతారా, స్వతంత్రంగా ఉంటారా?
Next articleసోషల్‌ మీడియాలో పోస్ట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీహెచ్