నటి, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కి తెలంగాణ హైకోర్టులో చుక్క ఎదురైంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ విజయశాంతి తెలంగాణ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2021లో కోకాపేట్, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూములను వేలం వేసిందని, ఈ వేలంలో ఒక్కో ఎకరాన్ని వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు సగటున రూ. 50 కోట్లకు కొనుగోలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ. 2,000 కోట్ల మేర ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ, టీఎస్ఐసీసీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూములను వేలం వేస్తే భవిష్యత్‌లో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపులే లేకుండా పోతాయని వాదిస్తూ ప్రభుత్వ భూముల వేలాన్ని సవాల్ చేస్తూ విజయశాంతి తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం భూములు అమ్మడాన్ని కోర్టు తప్పు పట్టలేదు . ప్రభుత్వం భూములు అమ్మడం సరికాదని చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. అయితే టెండర్లు, ఈ-వేలం తదితరాల ద్వారా పారదర్శకంగా భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. దీంతో ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.