కేసీఆర్‌తో విభేదాలు లేవు – చినజీయర్

శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ పోలేదు. చినజీయర్‌ స్వామి తీరుతో కేసీఆర్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అందువల్లే కేసీఆర్ ముచ్చింతల్‌కు పోలేదనే వార్తలు వినిపించారు. అయితే ఈ ప్రచారాన్ని చినజీయర్ స్వామి కొట్టిపారేశారు. కేసీఆర్‌తో విభేదాలు లేవని తెలిపారు. సీఎం రాకపోవడానికి అనారోగ్యం లేదా.. పని ఒత్తిడి కారణం కావొచ్చని భావిస్తున్నానని చెప్పారు. శనివారం జరిగే శాంతి కల్యాణానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు. సీఎం సహకారం ఉన్నందుకే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తాను ప్రథమ సేవకుడినని కేసీఆర్ అన్నారని చినజీయర్ స్వామి గుర్తుచేశారు.ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ఈ వాయిదా సీఎం కేసీఆర్‌ కోసమేనంటూ ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఫ్రధాని నరేంద్రమోదీ పర్యటన.. సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి మధ్య చిచ్చురేపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేకపోవడంతోనే ఇది మొదలైంది. సీఎం పేరు లేని విషయంపై సమాచారం అధికార వర్గాల ద్వారా సీఎంవోకు ముందుగానే అందింది. అంతేకాదు.. కొందరు చినజీయర్‌ ఆశ్రమంలోని వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మంచిదనే సంకేతాలను సీఎంకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారు. అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు.

Previous articleఆనం .. ప్రతిపక్షమా.. !అధికార పక్షమా ..!!
Next articleకేటీఆర్ ఫామ్ హౌస్ కేసు తీర్పును రిజర్వ్ చేసిన టీఎస్ హైకోర్టు!