జగన్‌ రెడ్డి ఒద్దు.. చంద్రబాబే ముద్దనుకుంటున్న మాజీ మంత్రి..?

ఆ దివంగత మంత్రి కుటుంబం కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకి. అంతే కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డిని కూడా ఆమాజీ మంత్రి కుటుంబం అప్పట్లో ఎక్కువగా ద్వేషించేది.ఆ మాజీ మంత్రి బతికినంత కాలం ఆ నియోజకవర్గంలో టిడిపికి ఎదురు ఉండేది కాదు. ఆ మాజీ మంత్రి వస్తున్నారంటే.. ప్రత్యర్ధులు పారిపోయేవారు.

ఆ మాజీ మంత్రి హత్యకు గురయ్యాక ఆయన రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన మరో మాజీ మంత్రి ఎన్నికలలో పలు దఫాలు ఓడిపోయి చివరకు అధికార పార్టీలో చేరి నానా అవస్థలు పడుతున్నారు. ఆయనకు అనేక విధాలుగా అవమానాలు ఎదురవుతున్నాయి. అదిగో.. ఇదిగో ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అని ఆ మాజీ మంత్రికి అరచేతిలో వైకుంఠం చూపారు జగన్‌ రెడ్డి. దీంతో ఆ మాజీ మంత్రి పునరాలోచనలో పడి ఎందుకు పార్టీ మారానా.. తెలుగుదేశంలో ఉన్నంత కాలం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఓడినా.. ఎదురు లేని నేతగా ఉన్నాను.. అధికార పార్టీలో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అంతు బట్టడం లేదని.. సన్నిహితులతో చెప్పి బాధ పడుతున్నట్లు బయటకు పొక్కింది.

పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా పిలిస్తే.. టిడిపిలో చేరేందుకు ఆ మాజీ మంత్రి సిద్దం అంటున్నారు. కానీ ఆ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకునేందుకు ఏ కారణాలతోనో తటపటాయిస్తున్నారే తప్ప ఆ మాజీ మంత్రిపై చంద్రబాబుకు ఏనాడు వ్యతిరేకత లేదు. ఆ మాజీ మంత్రి కూడా చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు ఎప్పుడు చేయలేదు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఆ దివంగత మాజీ మంత్రి పేరు పి.శివారెడ్డి. ఆయనను బాంబుల శివారెడ్డిగా ప్రత్యర్ధులు చెబుతుంటారు. శివారెడ్డి హత్యకు గురయ్యాక ఆయన రాజకీయ వారసుడిగా.. రాజకీయ తెరపైకి వచ్చిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రెండు దఫాలు టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు దఫాలు కాంగ్రెస్‌ అభ్యర్ధి, రెండు సార్లు జగన్‌ పార్టీ అభ్యర్ధిపై ఓడిపోయారు. ఒకప్పుడు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఆమాజీ మంత్రి కుటుంబానికి కంచుకోటగా పేరుండేది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లకు ఆ మాజీ మంత్రి కుటుంబం దూరమయ్యిందంటున్నారు.

2019 ఎన్నికల తరువాత అధికార పార్టీలో చేరినప్పటికీ.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఉన్న సీనియార్టీని అధికార ఎమ్మెల్యే కానీ, అధికార ముఖ్యనేతలు కానీ, చివరకు జగన్‌ రెడ్డికూడా గుర్తించటం లేదు. అనేక అవమానాలు దిగమింగుకుంటూ అధికార పార్టీలో ఏదో విధంగా కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి టిడిపి గూటికి చేరేందుకు తహ తహ లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఓడినా.. జమ్మలమడుగు నియోజకవర్గ ఏకైక నేతగా పేరుంది. అధికార పార్టీలో చేరాక ఆయన పరిస్థితి కడు దయనీయంగా ఉందంటున్నారు ఆ నియోజకవవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు.

Previous articleమంత్రి కొడాలి నాని విషయంలో కేశినేనినాని మౌనంలో..!
Next articleలోకేష్‌ దూకుడుతో చంద్రబాబులో మార్పు..!