లోకేష్‌ దూకుడుతో చంద్రబాబులో మార్పు..!

మాజీ మంత్రి నారా లోకేష్‌ రాజకీయంగా దూకుడు పెంచాకే పార్టీ అధినేత చంద్రబాబులో మార్పు వచ్చిందంటున్నారు టిడిపి ముఖ్య నేతలు. చేద్దాం.. చూద్దాం.. డిటైల్డ్‌గా మాట్లాడదాం.. మళ్లీ కలుద్దాం అని చంద్రబాబు ఎంతో మందికి చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలు కాలం గడిచాక నీటి మూటలయ్యాయి.

నియోజకవర్గాల ఇంఛార్జిల నియామకాలలో ఇతర విషయాలలో సకాలంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారని తెలుగుదేశం పార్టీలోనే తెర వెనుక ముఖ్య నేతలు చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి నారాలోకేష్‌ దూకుడు పెంచారు. విమర్శలకు, ఆరోపణలు ధీటుగా స్పందించి తనపై చేసిన విమర్శలు, ఆరోపణలు అసత్యమని.. దమ్ముంటే రుజువు చేయాలని అధికార నేతలకు సవాల్‌ విసిరి సంచలనం సృష్టించారు.

నిన్న కాక మొన్న కళ్లు తెరిచిన కుమారుడే అంత దూకుడుకు వెళ్తున్నప్పుడు.. తాను ఇంకా నిదానంగా వెళ్లటం సరికాదని.. చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ప్రదర్శిస్తున్న తీరుకు పార్టీ నేతలలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది.

ఎవరెవరికి ఏ చిన్న కష్టంవచ్చినా.. ఆ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. ప్రమాదాలకు, అనారోగ్యాలకు గురైనా.. మరణించినా.. అధికార నేతల వేదింపులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారని తెలిసిన వెంటనే ఆయన స్వయంగా బాధితులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పేది ఓపిగ్గా వింటూ ఏమైనా సహాయం కావాలా అని ప్రశ్నించి వారి అవసరం మేరకు సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

న్యాయపరమైన సహాయం కావాలంటే పార్టీ తరపున అందిస్తామని.. ఎలాంటి పరిస్థితులకు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని.. నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబులో ఈ ధోరణి కనబడుతున్న నేపధ్యంలో సామాన్య కార్యకర్తలు కూడా మా నేతలో మార్పు వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికార నేతల దౌర్జన్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు మానసికంగా సిద్దమవుతున్నారంటే.. అటు మాజీ మంత్రి నారా లోకేష్‌ దూకుడు, ఇటు చంద్రబాబు ఓదార్పులతో పార్టీలో మళ్లీ పాత పద్దతి తెరపైకి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Previous articleజగన్‌ రెడ్డి ఒద్దు.. చంద్రబాబే ముద్దనుకుంటున్న మాజీ మంత్రి..?
Next articleచంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల పొత్తుపై అధికార నేతలు భయపడుతున్నారా..?