
అటు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేనాదిపతి పవన్ కళ్యాణ్‌లు రాబోయే రోజులలో జరగబోయే ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే.. తమ పరిస్థితి ఏమిటని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. గత ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలు స్వతంత్రంగా పోటీచేయటంతో జగన్ పార్టీకి రాజకీయ లబ్ది చేకూరి అఖండ మెజార్టీతో అధికారం దక్కిందన్న విషయం జగమెరిగిన సత్యం.
తాజాగా జరుగుతన్న పరిణామాలతో పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు తెగ తెంపులు చేసుకుని టిడిపితో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగితే.. అధికార పార్టీ నేతలకు చుక్కల కనపడతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో కొందరు మంత్రులు బాహాటంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్‌లపై ఏ విధమైన రాజకీయ సవాల్ విసిరారంటే.. దమ్ముంటే ఎన్నికలలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పొత్తు కుదుర్చుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసి తమపై గెలవాలంటున్నారు.
దీనిని బట్టి రాబోయే రోజులలో జరగబోయే ఎన్నికలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి పోటీ చేస్తారన్న అనుమానం అధికార పార్టీ నేతలకుంది. ఇదే విషయంపై అటు టిడిపి నాయకులు, ఇటు జనసేన నాయకులు కూడా తెర వెనుక ఆ విధమైన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే.. అధికార పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావంటున్నారు టిడిపి, జనసేన నేతలు. ఇటీవల బయట పడ్డ పలు సర్వేల ఫలితాలు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని.. చంద్రబాబు ఓటు బ్యాంకు పెరిగిందని..పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు చెక్కు చెదర్లేదని.. గత ఎన్నికలలో ఆఖరి నిమిషంలో 5శాతం తటస్థులు జగన్ వైపు మొగ్గు చూపటంతో ఆ పార్టీకి 151 సీట్లు దక్కాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అందుకేనేమో అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులు, కొంతమంది ముఖ్యనేతలు బాహాటంగా బయట పడి తమ పార్టీపై ఒంటరిగా పోటీచేయాలని..అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కళ్యాణ్‌లకు సవాల్ విసిరి వారిద్దరిని రెచ్చగొడుతున్నారు. గతంలో జరిగిన తప్పిదాల అనుభవంతో తెలుసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పరస్పర అవగాహనతో కానీ.. పొత్తు కుదుర్చుకుని కానీ ఎన్నికలలో పోటీ చేయటం ఖాయమంటున్నారు తెర వెనుక ఆ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు.